కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘోర ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగింది. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బాధిత మైనర్ బాలిక కొప్పోలు గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అయితే, అదే గ్రామానికి చెందిన దుర్గం కమలాకర్ అనే వ్యక్తి ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసి, అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు తక్షణమే స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం కావడంతో నిందితుడు దుర్గం కమలాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు కమలాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ దారుణ ఉదంతంతో కొప్పోలు గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. పసివాళ్లపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే కామాంధులను ఉపేక్షించకూడదని స్థానికులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడు కమలాకర్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి, అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

