కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎబోలా వైరస్ (Ebola Virus) పేరు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. వైరస్ వ్యాప్తి ప్రమాదంపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు, ఐసోలేషన్ సదుపాయాలు ఏర్పాటు చేసింది. దీంతో ఎబోలా వైరస్ అంటే ఏమిటి? అది ఎంత ప్రమాదకరం? ఎలా వ్యాపిస్తుంది? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
ఎబోలా వైరస్ అంటే ఏమిటి?
ఎబోలా అనేది తీవ్రమైన వైరల్ వ్యాధి. ఇది మనుషుల్లో రక్తస్రావ జ్వరాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర వైరస్‌లలో ఇది ఒకటిగా పరిగణిస్తారు. 1976లో ఈ వైరస్‌ను మొదట గుర్తించారు. ఆఫ్రికాలోని ఎబోలా నది సమీప ప్రాంతంలో మొదటి వ్యాప్తి నమోదు కావడంతో దీనికి “ఎబోలా” అనే పేరు వచ్చింది. గతంలో నమోదైన వ్యాప్తుల్లో ఈ వైరస్ బారిన పడిన వారిలో మరణాల రేటు 25 శాతం నుంచి 90 శాతం వరకు నమోదైంది.
ఎబోలా ఎలా వ్యాపిస్తుంది?
ఎబోలా గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాదు. కానీ సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ఉంటే వైరస్ చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ ప్రధానంగా బాధితుల రక్తం, లాలాజలం, చెమట, మూత్రం, వాంతులు, విసర్జనలు, శరీర ద్రవాలు తగిలిన వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది. అలాగే వైరస్ సోకిన కోతులు, చింపాంజీలు, గబ్బిలాలు వంటి అడవి జంతువులతో సన్నిహితంగా ఉండటం వల్ల కూడా సంక్రమణ ప్రమాదం ఉంటుంది. వైరస్ సోకిన వెంటనే లక్షణాలు కనిపించవు. సాధారణంగా 2 నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు బయటపడతాయి. ప్రారంభ దశలో అకస్మాత్తుగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, తీవ్రమైన అలసట, గొంతు నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి.
వ్యాధి తీవ్రత పెరిగితే?
కొన్ని రోజులు గడిచిన తర్వాత పరిస్థితి మరింత విషమించవచ్చు. విషమించిన సమయంలో వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, చర్మంపై దద్దుర్లు, కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కేసుల్లో ముక్కు నుంచి రక్తం కారడం, నోటి నుంచి రక్తస్రావం, వాంతుల్లో రక్తం కనిపించడం, మలంలో రక్తం రావడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం జరగవచ్చు.
ఎబోలాను ఎలా గుర్తిస్తారు?
ఎబోలా లక్షణాలు మలేరియా, టైఫాయిడ్, మెనింజైటిస్ వంటి ఇతర వ్యాధులతో పోలి ఉంటాయి. అందువల్ల కేవలం లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయడం కష్టం. ప్రత్యేక ప్రయోగశాల పరీక్షల ద్వారా మాత్రమే వైరస్‌ను నిర్ధారిస్తారు.
ఎబోలాకు చికిత్స ఉందా?
ఎబోలాకు అన్ని రకాల వైరస్‌లపై పనిచేసే ఒకే ఒక్క పూర్తి స్థాయి చికిత్స ప్రస్తుతం లేదు.
వైద్యం..
శరీరానికి ద్రవాలు అందించడం, ఓఆర్ఎస్ ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, లక్షణాలకు అనుగుణంగా మందులు ఇవ్వడం ద్వారా రోగి కోలుకునే అవకాశాలు పెరుగుతాయి. వైద్యం ఎంత త్వరగా ప్రారంభిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఎబోలా వైరస్‌లోని కొన్ని రకాలపై టీకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది, ముందువరుసలో పనిచేసే వారికి ఇవి ఉపయోగపడతాయి. అయితే అన్ని రకాల ఎబోలా వైరస్‌లకు ఇంకా టీకాలు లేదా ప్రత్యేక చికిత్సలు అందుబాటులో లేవు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎబోలా నుంచి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాటిలో.. బాధితులతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకోకూడదు. శరీర ద్రవాలు తగలకుండా జాగ్రత్త పడాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. కలుషితమైన వస్తువులను తాకకూడదు. ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు అనవసర ప్రయాణాలు చేయకూడదు. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం..
ఎబోలా వైరస్‌పై ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు, ఐసోలేషన్ సదుపాయాలు ఏర్పాటు చేసింది. వైరస్ లక్షణాల గుర్తింపు, పరీక్షలు, అవసరమైన వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయపడకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

