అయ్యప్ప భక్తులకు (Ayyappa Devotees) దక్షిణ రైల్వే (Southern Railway) హెచ్చరిక జారీచేసింది. హారతి కర్పూరాన్ని (camphor) వెలిగించడాన్ని, తీసుకెళ్ళడాన్ని నిషేధించింది. రైల్వే స్టేషన్ ఆవరణలోనూ హారతి కర్పూరం వెలిగించడాన్ని నిషేధించింది. అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు ప్రతీ రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత పూజలో భాగంగా హారతి కర్పూరం వెలిగించడం ఆనవాయితీ అయినందున రైళ్ళలో, రైల్వే స్టేషన్లలో అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉందన్న దృష్టితో ఈ నిషేధాజ్ఞలు విధించింది.
హారతి కర్పూరంతో పాటు అగరవత్తులు వెలిగించడం, దీపాలు వెలిగించడం లాంటి కార్యక్రమాలపైనా నిషేధం విధించింది. రైల్వే స్టేషన్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సబ్‌వేలు, ప్లాట్‌ఫారంలు, వెయిటింగ్ హాల్స్ తదితర రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే ప్రాంతాలన్నింటా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. శబరిమలై అయ్యప్ప ఆలయానికి రైళ్ళలో వెళ్ళే భక్తులను ఉద్దేశించి ఈ ఆంక్షలు విధించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి చర్యలపై నిఘా వేస్తారని, భక్తులకు అవగాహన కలిగిస్తారని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


