కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) నిర్వహించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్న ఏకపక్ష నిర్ణయమా?.. లేక మంత్రులందరి సమిష్టి నిర్ణయమా?.. లేక కొందరికి భిన్నాభిప్రాయం ఉన్నదా?.. ఇలాంటి అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను గ్రాండ్‌గా చేయాలన్న అంశంలో మంత్రులకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ దాన్ని గ్లోబల్ సమ్మిట్ రూపంలో జరపాలన్న ప్రతిపాదనను ఇద్దరు మంత్రులు వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇందుకు నిర్దిష్టంగా కారణాలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి వివరించినట్లు తెలిసింది. కానీ సీఎం దీనిని పరిగణనలోకి తీసుకోకుండా సమ్మిట్ నిర్వహించాలనే నిర్ణయాన్నే తీసుకున్నారు.
ఆలస్యంగా వెలుగులోకి.. :
గ్లోబల్ సమ్మిట్(Global Summit) పూర్తయింది… సక్సెస్ అయిన విధానాన్ని ఢిల్లీకి వెళ్ళి మరీ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున్ ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. సుమారు రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు (Investments) కూడా వచ్చాయి. నాలుగైదు రోజుల తర్వాత సమ్మిట్‌కు సంబంధించిన ఒక్కో అంశం వెలుగులోకి వస్తున్నది. సమ్మిట్‌కు సంబంధించి ఆహ్వాన పత్రికలు రూపకల్పన, విజన్ డాక్యుమెంట్ ముసాయిదా తయారీ, మీడియాలో అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వడం మొదలు లాంఛనంగా ఆవిష్కరించేంత వరకు కొందరు మంత్రులకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమం కావడంతో యాక్టివ్‌గానే పార్టిసిపేట్ చేశారని సచివాలయ వర్గాల సమాచారం. ఈ సమ్మిట్ ద్వారా మంత్రులు హైలైట్ కాకపోయినా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి మాత్రం మైలేజ్ వచ్చిందనేది ఆ వర్గాల భావన.
దావోస్ ఉండగా సమ్మిట్ ఎందుకు? :
ఎలాగూ ప్రతి ఏటా జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో (Davos) వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) జరుగుతుందని, ఈసారి సెషన్‌లో అక్కడ పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూ (MoU)లు కుదుర్చుకోవచ్చని ఆ ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనందున సమ్మిట్ నిర్వహణకు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం ఇబ్బందికరంగా ఉంటుందనే కారణాన్ని సీఎంకు వివరించినట్లు తెలిసింది. ఇప్పుడు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ద్వారా వచ్చే మైలేజీని దావోస్ వేదిక ద్వారానే బాహ్య ప్రపంచానికి తెలియజేయవచ్చుననే సూచన చేసినట్లు సమాచారం. కానీ ఈ రెండింటికీ లింక్ పెట్టాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
మున్ముందు ప్రభావంపై ఊహాగానాలు :
గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ నేతల దృష్టిలో హీరో అయ్యారు… భారీ పెట్టుబడులతో ఇతర రాష్ట్రాలకూ ఒక మెసేజ్ ఇచ్చినట్లయింది… దీని స్ఫూర్తితో దావోస్‌లోనూ ఇదే స్థాయిలో మరిన్ని పెట్టుబడులు తెచ్చుకోడానికి గ్రౌండ్ దొరికినట్లవుతుంది… విజన్ డాక్యుమెంట్‌ను దేశ, విదేశీ ఇన్వెస్టర్లకు వివరించడం ద్వారా ఇతర రాష్ట్రాలకంటే ఈసారి ఎక్కువ ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది… ఇలాంటి అభిప్రాయాలు కూడా పార్టీ నేతల్ల వ్యక్తమవుతున్నాయి. ముగిసిపోయిన ఈవెంట్‌పై పోస్టుమార్టం నిర్వహించడం వృథా అయినప్పటికీ అసంతృప్తితో ఉన్న మంత్రులు రానున్న రోజుల్లో క్యాబినెట్ సమావేశాల్లో ఎలాంటి స్వరం వినిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీ నేతలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదనే ఆలోచనతో ఇకపైన సర్దుకుపోతారా?.. లేక భిన్న స్వరాన్ని వినిపిస్తారా అనేది కీలకం.
Read Also: మెస్సీ పక్కన రాహుల్, రేవంత్ ప్లేస్ డిసైడ్ చేసేదెవరు?
Follow Us On: X(Twitter)


