కలం డెస్క్ : ఉప్పల్ స్టేడియంలో మెస్సీ (Lionel Messi) వర్సెస్ రేవంత్ (Revanth) ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ (Football) మ్యాచ్ ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్. యూత్, క్రీడాభిమానుల్లో ఇది సరికొత్త క్రేజీ. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సైతం ఈ మ్యాచ్ చూడడానికి ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చారు. కానీ మెస్సీకి ఒకవైపు (Right Side) సీఎం రేవంత్‌రెడ్డి, మరోవైపు (Left Side) రాహుల్‌గాంధీ ఉంటారంటూ షెడ్యూల్ షీట్‌లో పేర్కొనడం చర్చకు దారితీసింది. దేశానికి కాబోయే ప్రధాని (Future Prime Minister) రాహుల్‌గాంధీ అంటూ కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిద్దరి ప్రాధాన్యతను తక్కువ చేసి మెస్సీని ప్రామినెంట్‌గా పేర్కొనడమే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడుపడడంలేదు. మెస్సీతో రాహుల్, రేవంత్ ఫోటో షూట్‌కు (Photo Shoot) గర్వపడాలా?.. లేక ఎవరు ఎటువైపు నిల్చోవాలో ఇతరులు డిసైడ్ చేసే పరిస్థితికి సిగ్గుపడాలా?.. ఇదీ పార్టీ శ్రేణుల ఆవేదన.
మనల్ని మనం తక్కువ చేసుకోవడమే :
“హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీని ఒక అతిథిగా గౌరవించడంలో తప్పులేదు.. కానీ ఆయననే కేంద్రంగా చేసుకుని రాహుల్, రేవంత్ ప్లేస్‌లను డిసైడ్ చేయడమంటే మన ప్రాధాన్యతను తగ్గించడమే… ఒక రకంగా మెస్సీ వీరిద్దరికంటే ఎక్కువ అని చెప్పుకోవడమే… మన పక్కన ఎవరుంటారు అని చెప్పుకునేలా షెడ్యూలు ఉండాలి.. కానీ దీనికి బదులుగా మనం ఎవరి పక్కన ఉండాలి అని చెప్పుకోవడం బాధాకరం.. ఇది మన స్థాయిని మనమే దిగజార్చుకున్నట్లయింది…” పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మెస్సీ(Lionel Messi) కోల్‌కతా స్టేడియానికి వెళ్తే పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వెళ్ళలేదని, అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమై నిరసనకు దారితీసిన తర్వాత మాత్రమే ఆమె తన విజిట్ గురించి ప్రస్తావించారని గుర్తుచేశారు.
విపక్షాల విమర్శలకంటే ఇదే బాధాకరం :
గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit) రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దేశవ్యాప్తంగానే గుర్తింపు లభించింది. కాంగ్రెస్ నేతలే కాక రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు సైతం రేవంత్‌ను అభినందించారు. దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్ నగరానికి వచ్చి సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందాలు (MoU) కుదుర్చుకోవడం ఆయన ఇమేజ్‌కు నిదర్శనమన్నది కాంగ్రెస్ శ్రేణుల వాదన. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా బాధ కలగలేదని, వాటికి దీటుగా సమాధానం చెప్పామని, కానీ మెస్సీతో స్టేడియంలో ఫోటో షూట్ సందర్భంగా రాహుల్, రేవంత్ నిల్చునే స్థానాలను కూడా నిర్వాహకులే డిసైడ్ చేయడమంటే మన గౌరవాన్ని మనమే కోల్పోయినట్లయిందని, తెలంగాణ ప్రజలు దేన్నయినా తట్టుకుంటారుగానీ ఆత్మగౌరవం దగ్గర రాజీపడరని శ్రేణులు గుర్తుచేశాయి.

Read Also: స్పెషల్ ఫ్లైట్ లో రాత్రికి రాత్రే ఢిల్లీకి రాహుల్, రేవంత్… ఆంతర్యమేంటి?
Follow Us On: Sharechat


