కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేశంలో ఐటీ విప్లవ పితామహుడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అంటూ మంత్రి శ్రీహరి (Vakiti Srihari) కొనియాడారు. దేశంలో సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేశారు. యువతకు నూతన అవకాశాల దారులు తెరిచిన మహానేత అంటూ అభివర్ణించారు. గురువారం మక్తల్‌లో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని రాజీవ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థల బలోపేతం వంటి కీలక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకెళ్లిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
యువత చేతుల్లో దేశ భవిష్యత్తు
యువత శక్తిపై అపార విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని నమ్మారని మంత్రి వాకిటి శ్రీహరి Vakiti Srihari గుర్తుచేశారు. 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యవ్యవస్థలో యువశక్తికి ప్రాధాన్యం పెంచారని మంత్రి పేర్కొన్నారు. సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి, దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న రాజీవ్ గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కూడా యువత అభివృద్ధి, డిజిటల్ పురోగతి, క్రీడలు, ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మక్తల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

