కలం, వరంగల్ బ్యూరో: సూర్యుడు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో మండు వేసవి బారి నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు చక్కటి ఆలోచన చేశారు. హనుమకొండ (Hanamkonda) నగరంలో రెండుచోట్ల మిస్ట్ బస్‌స్టాప్ (Mist Bus Stops)లను ఏర్పాటు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గురువారం బస్‌స్టాప్‌లను ప్రారంభించారు.
రాష్ట్రంలో ప్రథమం..
రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా ప్రప్రథమంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు మిస్ట్ బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రధాన గేట్ పక్కన, పెట్రోల్ పంప్ పబ్లిక్ గార్డెన్ దగ్గర మిస్ట్ బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేశారు. మిస్ట్ బస్‌స్టాప్‌లలో ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రజలతో కలిసి కూర్చుని ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు.
తుంపర్లతో చల్లదనం..
మండు వేసవిలోనూ ప్రజల సౌకర్యార్థం చల్లగా ఉండేలా బస్‌స్టాప్‌లను తీర్చిదిద్దారు. మిస్ట్ బస్‌స్టాప్‌లలో పైన ఉన్న వెదురు తడకలపై నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోటార్ల పైపుల ద్వారా చిన్నచిన్న నీటి తుంపరలు పడుతుంటాయి. దీంతో బస్‌స్టాప్‌లో ఉన్న ప్రజలకు చల్లని ప్రాంతంలో కూర్చున్న అనుభవం కలుగుతుంది. వేసవి దృష్ట్యా వడగాలులు వీస్తుండగా వాటి నుండి రక్షణగా ఈ మిస్ట్ బస్‌స్టాప్‌లు చల్లధనానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి.
ప్రజా శ్రేయస్సు కోసం..
నగరానికి వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారని, బస్సులలో వెళ్లేందుకు వేచి చూస్తుంటారని.. ప్రజల ఆరోగ్యం, భద్రత, ప్రయాణ సౌకర్యం దృష్టిలో ఉంచుకుని మిస్ట్ బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేసినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మిస్ట్ బస్‌స్టాప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మిస్ట్ బస్‌స్టాప్‌లలో చల్లని వాతావరణం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. ఎండవేడిమి నుండి ప్రజలకు ఉపశమనం కోసం మిస్ట్ బస్‌స్టాప్‌లను జీడబ్ల్యూఎంసీ నిధులతో రెండింటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడే ఉన్న పలువురు యువకులు, మహిళలు మాట్లాడుతూ.. వేసవిలో ఎండలు మండుతున్నాయని, వేడిమి నుండి ఉపశమనం కల్పిస్తూ చల్లగా ఉండేవిధంగా కొత్తగా బస్‌స్టాప్‌లను తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండీ. అజీజ్ ఖాన్, జీడబ్ల్యూఎంసీ ఈఈ రవికుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

