కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ నాశనమైందని నీటి పారుదల మంత్రి ఉత్తమ్ ( Minister Uttam) కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాలమూరు ప్రాంతంలోని నీటి పారుదల ప్రాజెక్టులను సందర్శించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఈ విమర్శలు చేశారు. గత ప్రభుత్వం పాలమూరుకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ సహా.. పదేళ్ల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తయినట్టు.. బీఆర్ఎస్ పదే పదే అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడమే పెద్ద తప్పు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల భారాన్ని రాష్ట్రం ఇప్పటికీ మోస్తోందని చెప్పారు.
తమ ప్రభుత్వం కృష్ణా జలాల హక్కుల కోసం పోరాడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాకే.. కృష్ణా బేసిన్ లో అధికంగా వ్యవసాయం ఉత్పత్తి జరిగిందని స్పష్టం చేశారు. తమ హయాంలోనే అత్యధికంగా వరిసాగు జరిగిందన్నారు. అంతేకాదు దేశంలోనే అత్యధికంగా ధాన్యం సేకరణ జరిగిందని వివరించారు.

