కలం, కోదాడ: సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని రెడ్లకుంట ఎత్తిపోతల పథకం (Redlakunta Lift Irrigation) పనులను ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. కోదాడ మండలం పరిధిలో పాలేరు వాగుపై రూ. 47.64 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకం పనులను బుధవారం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ… రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ప్రధాన కాలువ, భూగర్భ మోటార్లు, సబ్‌స్టేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని గుత్తేదారులను (కాంట్రాక్టర్లను) ఆదేశించారు. ఈ పథకం పూర్తయితే వానాకాలం, యాసంగి సీజన్లలో మొత్తం ఆరు గ్రామాల పరిధిలోని 4,460 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి వివరించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 1,486 రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని, ఇందులో బిసి-720, ఎస్సీ-446, ఓసి-290, ఎస్టీ-30 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఎత్తిపోతల పథకం కోసం ఒక్కోటి 430 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు భారీ వీటీ మోటార్లను వినియోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, నీటిపారుదల శాఖ సీఈ నాగభూషణం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

