కలం, ఖమ్మం బ్యూరో : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని ఎఫ్‌సీఐ గోదాం నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.3.05 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, యంగ్ ఇండియా పాఠశాలల ఏర్పాటు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
గుడిసెలలో ఉండే పేదలకు కొత్త ఇళ్ల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. మున్నేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.600 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి (Minister Tummala) తెలిపారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మం నగరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని, స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని తుమ్మల సూచించారు. వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఖమ్మం ఖిల్లా రోప్‌వే ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, వెలుగుమట్ల అర్బన్ పార్కును హైదరాబాద్ కేబీఆర్ పార్కు తరహాలో తీర్చిదిద్దుతున్నామని వివరించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా పాలనలో మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఆర్డీవో శ్రీనివాస్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: జడ్జిలపై దాడులు చేస్తే తీర్పులు ఇవ్వలేం: సుప్రీంకోర్ట్
Follow Us On: Instagram

