Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి అభివృద్ధిపై మంత్రి తుమ్మల ఫోకస్

కలం, ఖమ్మం బ్యూరో :  ఈ నెల 27న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం జరగనున్న నేపథ్యంలో, జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధికి మంత్రి తుమ్మల కీలక దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనుల పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాగునీటి పనులు, భూసేకరణ, రైల్వే లైన్ పనులు, పర్యాటక అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) భద్రాచలం (Bhadrachalam) పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల సూచించారు.

భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘భక్తుల సేవలో ప్రభుత్వం’ అనే నినాదంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సకల సౌకర్యాలతో కళ్యాణం వీక్షించేలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. భద్రాచలం ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ. 300 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, తొలి విడతలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భద్రాచలం గుడి ప్రాకార నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అలాగే ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, పూల మొక్కల సుందరీకరణ పనులు ఉగాది నాటికి పూర్తి చేసేలా ముమ్మరంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో సాగునీటి విస్తరణకు కీలకమైన సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు పనులు వేగవంతమై రైతులకు త్వరగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో యాతాలకుంట టన్నెల్‌లో మిగిలిన సుమారు 100 మీటర్ల పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 50 వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>