కలం/ఖమ్మం బ్యూరో : భద్రాద్రి రామయ్య ఆలయంలో మార్చి 2026 లో జరగబోయే శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. భద్రాచలం రామాలయం మాడ వీధుల విస్తరణ పనులు ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలని మంత్రి తెలిపారు. బుధవారం హైదరాబాద్ సచివాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ తో ఆలయ విస్తరణ పనులపై మంత్రి తుమ్మల చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల సౌకర్యం కోసం ఆలయం విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రామాలయం మాడ వీధుల విస్తరణ పనులు దశల వారీగా మూడు ఏళ్లలో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ కు మంత్రి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నవ భద్రాద్రి దిశగా కృషి చేస్తున్నామన్నారు. భూ సేకరణ తరువాత అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతామన్నారు.
కుంభ మేళ తరహాలో గోదావరి పుష్కరాలు
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కూడా దేవాదాయ శాఖ కమిషనర్ తో చర్చించారు మంత్రి తుమ్మల. కుంభమేళా తరహాలో భద్రాచలంలో పుష్కరాలు నిర్వహించాలని సూచించారు. గోదావరి నదిలో పుష్కర స్నానానికి లక్షలాది మంది భక్తులు వస్తారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నానాల ఘాట్లు, వసతి కేంద్రాలు, మెడికల్ క్యాంప్ లు, శానిటేషన్, తాగునీరు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.


