కలం, వెబ్ డెస్క్ : ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ (Indian Army) వినూత్న కార్యక్రమం చేపట్టింది. జమ్మూ కశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎక్కువ ఉండడంతో వారికి సాయుధ శిక్షణ అందిస్తోంది. రక్షణలో భాగస్వామ్యం చేయడానికి గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసి.. ఆయుధాల వినియోగం, ఆత్మరక్షణ మెలకువలు, పోరాట నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ శిక్షణలో భాగంగా జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలోని 17 గ్రామాల నుంచి సుమారు 150 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు. వీరికి కొండలు, లోయలు ఉన్న ప్రాంతాల్లో ఉగ్రదాడులను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రామాలను పర్యవేక్షించడంతో పాటు తమను తాము రక్షించుకోవడం లాంటి వాటిలో Indian Army అధికారులు శిక్షణ ఇస్తున్నారు.
రాష్ట్రీయ రైఫిల్స్ తో పాటు జమ్మూ కశ్మీర్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆయుధాల వాడకం, బంకర్ల రక్షణ, ఎదురుదాడి ఎలా చేయాలో తర్ఫీదు ఇస్తున్నారు. ఈ శిక్షణలో పురుషులతో పాటు మహిళలు కూడా పాల్గొనడం విశేషం. దీని ద్వారా స్థానిక గ్రామాల ప్రజల భద్రత బలోపేతం అవడంతో పాటు ఉగ్రవాదుల కదలిక కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.


