కలం, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ జోష్ మందుబాబులకు బుధవారం సాయంత్రం నుంచే మొదలైంది. చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) లో పోలీసులకు మందుబాబులు చుక్కలు చూపించారు. అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాత్రి వేళ జరిగింది. ఫుల్‌గా తాగిన ఓ వ్యక్తి బైక్ నడుపుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) పరీక్ష లు చేస్తున్న పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్‌లో ఊదడానికి మాత్రం ఒక పట్టానా సహరించలేదు. దాదాపు గంటసేపు సతాయించాడు. పోలీసులు బతిమాలినా మాట వినలేదు. ‘ఎహె నేను ఊదను’ అంటూ బ్రీత్ అనలైజర్‌లో ఊదడానికి ఒప్పుకోలేదు. ‘నేను తాగిన.. కానీ, ఊదను’ అంటూ పోలీసుల్ని విసిగించాడు. పోలీసులు బ్రీత్ అనలైజర్ నోటిలో ఉంచడం, మందుబాబు ఐదు సెకన్లు కూడా ఊదకపోవడం ఇలా పదే పదే జరిగింది. ఆఖరికి ఎలాగోలా మందుబాబును ఒప్పించిన పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేసి చూస్తే 89శాతం రీడింగ్ చూపింది. అనంతరం అతని వయసు అడిగిన పోలీసులు.. 58 అని మందుబాబు చెప్పడంతో ఆ వయసులో అంత ఫుల్‌గా తాగి బైక్ నడపడం అవసరమా అంటూ మందలించారు. వివరాలు కనుక్కొని, చలానా రాసి పంపించారు.


