Mobile Popup Ad
Mobile Popup Ad

టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ

క‌లం, వెబ్ డెస్క్: ప్ర‌జా సేవ‌, రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు బాలిక‌ల‌కు మాక్ అసెంబ్లీ (Girls Mock Assembly) నిర్వ‌హించిన‌ట్లు మంత్రి సీత‌క్క (Minister Seethakka) వెల్ల‌డించారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హాల్‌లో ఉన్న‌ పురాత‌న‌ కౌన్సిల్‌ భవనంలో బుధవారం టీనేజ్ బాలికలకు రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ సమావేశాలను నిర్వ‌హించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపికైన కిశోర బాలికలు ప్రజాప్రతినిధుల పాత్రలో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించారు. అధికార, విపక్ష సభ్యులుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతూ వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. బాలిక‌లంతా తెల్ల‌టి ఖాదీ దుస్తులు, కండువాల‌తో ప్ర‌త్యేక వేష‌ధార‌ణ‌లో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. సాధార‌ణ అసెంబ్లీ స‌మావేశాల మాదిరిగానే బాలిక‌లు స‌భ‌లో ప‌ర‌స్ప‌రం త‌మ వాద‌న‌లు వినిపించారు. ఆరోగ్యం, విద్య, ఆదివాసీ సంక్షేమం, సోషల్ మీడియా ప్రభావం, యువత భవిష్యత్ వంటి పలు అంశాలపై చర్చించారు. గ‌తంలో టీనేజ్ బాలికల స్నేహ సంఘాల ఆధ్వర్యంలో ముందుగా మండల స్థాయిలో, అనంతరం జిల్లా స్థాయిలో మాక్ అసెంబ్లీలు నిర్వహించారు. ఈ స‌మావేశాల్లో ప్రతిభ కనబరిచిన బాలికలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీత‌క్క (Seethakka) మాట్లాడుతూ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా పూర్త‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన సెర్ప్ సీఈవో దివ్య దేవ‌రాజ‌న్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీనేజ్ బాలికలకు ఇలాంటి వేదికలను కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. స‌భ‌లో బాలికలంద‌రూ చ‌ర్చ‌లో పాల్గొన్నార‌ని, ప్ర‌తి అంశంపై చ‌క్క‌గా మాట్లాడార‌ని కొనియాడారు. ప్రస్తుతం సోషల్ మీడియా యువతను అత్యంత వేగంగా ఆకర్షిస్తోందని, ఒక రీల్ చూడడం ప్రారంభిస్తే గంటల తరబడి సమయం వృథా అయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

అలాంటి ఆకర్షణలకు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని బాలిక‌ల‌కు సూచించారు. యువ‌త‌లో ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి రావాలంటే చదువు అవసరం లేదనే భావన సరికాదని, నాయకత్వం వహించాలంటే మంచి విద్య, నిరంతర అధ్యయనం, విజ్ఞానం అవసరమని సూచించారు.

Read Also: రౌడీలతో నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ.ఆనంద్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>