Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమలపురంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతులు ఎప్పుడూ ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని, ఎరువులను కూడా మోతాదుకు మించి వాడకుండా నేలలను సంరక్షించుకునే చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి (Jillela Chinna Reddy) పేర్కొన్నారు. బుధవారం వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జయన్న తిరుమలాపూర్ (Jayanna Tirumalapur) (తిరుమలపురం) గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, వర్షాకాలం నేపథ్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు, పంట మార్పిడి, ఎరువుల వాడకం, పరిసరాల పరిశుభ్రత, వన మహోత్సవం, జల సంరక్షణ, పాఠశాలల్లో సౌకర్యాలు సహా తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రణాళిక అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి గ్రామసభ తిరుమలపురం (Jayanna Tirumalapur) గ్రామంలోనే నిర్వహించామన్నారు. చివరి గ్రామ సభను కూడా మన గ్రామంలోనే నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఇటీవల రెండు రోజులు పాలమూరు జిల్లాలో పర్యటించి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారని తెలిపారు.

రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ఎరువులను కూడా మోతాదుకు మించి వాడకుండా నేలలను సంరక్షించుకునే చర్యలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎరువులు అత్యధికంగా వినియోగించడం వల్ల భూములలో సారవంతం తగ్గి భవిష్యత్తులో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి ఎరువులు మోతాదుకు మించి వినియోగించకుండా జాగ్రత్త పడాలన్నారు.

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి గ్రామసభ తిరుమలపురం గ్రామంలోనే నిర్వహించినట్లు తెలిపారు. చివరి గ్రామ సభను కూడా గ్రామంలోనే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధి హామీ కింద గ్రామస్థులు అందరూ తమ ఇళ్ల వద్ద పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామంలో భూగర్భ జలాలు పెరిగి మంచినీటి సదుపాయాలు కలుగుతాయన్నారు.

అదేవిధంగా గ్రామంలో గత ఐదేళ్ల వ్యవధిలో 18 ఏళ్ల నుండి 59 ఏళ్లలోపు వ్యక్తులు ఎవరైనా మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకొని రూ.20 వేల లబ్ధి పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తుందని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి గోపాల్, నాయకులు యాదయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి మూజహిద్, మండల స్థాయి అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: రౌడీలతో నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ.ఆనంద్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>