కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి (Sankranti) పండుగ సందర్భంగా, ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఇదే అదునుగా భావించి ప్రైవేట్ ట్రావెల్స్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. పండుగకు ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలనుకున్న ప్రయాణికులు ఆ ఛార్జీలు చూసి తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పండుగ సందర్భంగా ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) ప్రకటించారు.
ప్రైవేట్ బస్సులలో అక్రమంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయించిన ఛార్జీల కంటే ఎక్కువగా వసూలు చేస్తే సంబంధిత బస్సులను వెంటనే సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


