కలం, వెబ్ డెస్క్: ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ (Army Chief) ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్, పశ్చిమ సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా కొనసాగుతుందని, ఉగ్రవాదం భారీగా తగ్గుతోందని ఆయన అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే 10 నుంచి భద్రతా చర్యలను మరింత సమర్థమంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. “2025లో మొత్తం 31 మంది ఉగ్రవాదులను తుడిచిపెట్టాం. వారిలో 65 శాతం మంది పాకిస్తాన్ మూలానికి చెందినవారు” అని ద్వివేది అన్నారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పట్టుకున్నామని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు తగ్గిందని, ఉగ్రవాద (Terrorism) నియామకాలు దాదాపుగా లేవని, 2025లో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆర్మీ చీఫ్ అన్నారు. “ఇవి జమ్మూ కాశ్మీర్‌లో సానుకూల మార్పుకు స్పష్టమైన సూచికలు” అని ఆయన అన్నారు. ఉగ్రవాదం తగ్గడంతో దేశంలో పర్యాటకం ఊపందుకుందన్నారు. సైనిక కార్యకలాపాలను ప్రస్తావిస్తూ.. ఆపరేషన్ సిందూర్ త్రి-సేవా సమన్వయానికి ఒక ఉదాహరణ అని ఆర్మీ చీఫ్ అన్నారు. భవిష్యత్తులో ఏదైనా దుస్సాహసం జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, నిఘా సంస్థలు, రాష్ట్ర పరిపాలన, పౌర సంస్థల మధ్య సమన్వయం చాలా కీలకమని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు.


