కలం డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ విధానంపై రాష్ట్ర హైకోర్టు వెలువరించిన మధ్యంతర స్టే ఉత్తర్వులను లీగల్ గా ఎదుర్కొంటామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) స్పష్ట, చేశారు. హైకోర్టు వెలువరించి మధ్యంతర స్టే ఉత్తర్వుల పూర్తి పాఠాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలనే వినిపించామని, ఎన్నికల నిర్వహణకు సానుకూల స్పందన వస్తుందని భావించామని, కానీ ఆరు వారాల వరకు జీవో అమలుపై మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీచేయడం రాష్ట్ర ప్రభుత్వానికే కాక బీసీలకు రాజకీయపరంగా అవకాశాలు కల్పించాలన్న స్ఫూర్తికి విఘాతం కలిగినట్లయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి బీసీలకు మెరుగైన అవకాశాల కోసం తీవ్ర స్థాయిలో కసరత్తు చేసిందని మంత్రి గుర్తుచేశారు. శాస్త్రీయబద్ధంగా కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ వేసి, సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదంతో శాసన సభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చించిందని, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చట్టం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపామని వివరించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి గత ప్రభుత్వం 2018 మార్చిలో తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ చట్టం అవరోధంగా ఉండడంతో దానికి అసెంబ్లీ, కౌన్సిల్ లో సవరణలు కూడా జరిగాయన్నారు. స్థానిక సంస్థల గడువు గతేడాదిలోనే పూర్తయిందని, అప్పటి నుంచి కేంద్ర నిధులన్నీ ఆగిపోయాయని, వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు(High Court) ఇచ్చిన స్టే ఉత్తర్వులతో అన్యాయం జరుగుతుందన్నారు.
రాజకీయపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి పొన్నం(Minister Ponnam) స్పష్టం చేశారు. సామాజిక న్యాయం స్ఫూర్తికి ఛాంపియనే కాంగ్రెస్ పార్టీ అని, దానికి నిదర్శనమే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ విధానమన్నారు. బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా కొందరు హైకోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నారని, నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తరఫున ఇంప్లీడ్ పిటిషన్లు ఎందుకు దాఖలు కాలేదని ప్రశ్నించారు.
Read Also: తెలంగాణ స్థానిక ఎన్నికలకు బ్రేక్

