కలం డెస్క్ : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో (నెం.9)పై హైకోర్టు(TG High Court) మధ్యంతర స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కౌంటర్ అఫిడవిట్ పై పిటిషనర్లు రెండు వారాల్లో రీజాయిండర్ (అభ్యంతరాలు/స్పందన) తెలియజేయాలని ఆదేశించింది. ఆరు వారాల వరకు ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పరిణామాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ కూడా ఆగిపోయినట్లయింది.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో జారీ అయిన నోటీసుల అమలు కూడా ఆగిపోయింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన జీవో అమలు హైకోర్టు(TG High Court) ఆదేశాలతో అర్ధాంతరంగా ఆగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా?.. లేక పార్టీపరంగా రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటుందా?.. అనేది ఆసక్తికరంగా మారింది.

