ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు : పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో: రైతులు ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) కోరారు. ప్రతి గ్రామంలోనూ ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ పండించడం ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని ఈ విషయంలో తాను గ్యారంటీ ఇస్తానని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను మంత్రి రైతులకు పంపిణీ చేశారు. 24 మంది రైతులకు 40.80 లక్షల రూపాయల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లను అందజేశారు. 15 రోటవేటర్లు, బెయిలర్లు, పవర్ స్ప్రేయర్లు, తదితర పరికరాలు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చిన్న గ్రామంలో 50 ఎకరాలు పెద్ద గ్రామంలో 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని సూచించారు. పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చని అంతర పంటలు కూడా వేసుకోవచ్చని తెలిపారు. నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫ్యాక్టరీని ఇటీవల ప్రారంభించుకున్నామని అక్కడ కొనుగోలు చేపడతారని పొన్నం భరోసా ఇచ్చారు.

అశ్వరావుపేట ఆదర్శం

ఆయిల్ పామ్ (Oil Palm) సాగులో అశ్వరావుపేట ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. వ్యవసాయ పనిముట్లు అవసరం ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతిపాదనలు వచ్చిన వెంటనే అదనంగా పరికరాలు మంజూరు చేయించి రైతులకు పంపిణీ చేస్తామన్నారు.  చాలా సంవత్సరాల తరువాత ప్రజాప్రభుత్వంలో పనిముట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గడ్డి మోపులు కట్టే బేయిలర్లు ఎక్కువగా అవసరం ఉన్నాయని చెబుతున్నారు. వాటిని ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఎక్కడా ఇబ్బందులు లేవని చెప్పారు. తాను కూడా ఆయిల్ ఫామ్ పంటను చేసేందుకు వ్యవసాయ భూమిని చూస్తున్నానని తెలిపారు. అనుకూలంగా భూమి దొరికితే పంటను సాగు చేస్తానని పేర్కొన్నారు. 5 ఎకరాల పైన ఉన్న వారు ఆయిల్ ఫాం సాగు చేయాలనీ కోరారు.

త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి

ఆయిల్ ఫాం సాగు వల ప్రకృతి ఇబ్బందులు, కోతుల సమస్యతో పాటు ఏ ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ విజిట్ చేయాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు (Gouravelli Project) నిర్మాణంలో భాగంగా సాగునీటి కాలువల నిర్మాణానికి అందరూ సహకరించాలని పేర్కొన్నారు. ఇటీవల గౌరవెల్లి ప్రాజెక్ట్ పై సమావేశం జరిగిందనీ.. త్వరలోనే కాలువ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తపెళ్లి నుంచి హుస్నాబాద్ కు ఫోర్ లైన్ రోడ్ నిర్మాణ పనులకు అందరూ సహకరించాలని కోరారు. కల్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యం చేయకుండా వెంటవెంటనే అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, ఆర్డిఓ కే మహేశ్వర్ సర్పంచ్ ఆకవరం భవానీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి తహసిల్దార్ రమేష్, ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

యంగ్ ఇండియా స్కూల్ కోసం స్థల పరిశీలన

చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో 1-12 తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను నిర్మించనున్నామని చెప్పారు. పాఠశాల ప్రాంగణంలోనే ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థలంపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో విద్యను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read Also: క్యాతనపల్లిలో నీచమైన రాజకీయాన్ని చూశాం: కేటీఆర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>