కొత్త మంత్రులు ఎవరు? AICCతో సీఎం రేవంత్ కీలక భేటీ!

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మరోమారు ఢిల్లీ వెళ్ళే అవకాశమున్నది. వారం రోజుల తర్వాత ఏఐసీసీ పెద్దలతో రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ (Telangana Cabinet Expansion)పై చర్చించనున్నారు. మంత్రివర్గంలోని రెండు ఖాళీ బెర్తులపై గతంలోనూ రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. ఎవరెవరు ఆశిస్తున్నారో, ఎవరికి అవకాశం ఇవ్వడం సముచితంగా ఉంటుందో పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పటివరకూ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్నందున ఏఐసీసీ పెద్దలకు రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై దృష్టి పెట్టే అవకాశం లేకపోయింది.

కేరళంలో (Kerala) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎంపికతో పాటు మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది కూడా ఏఐసీసీకి ప్రాధాన్యతా అంశంగా మారింది. ఈ హడావిడి ముగిసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి తెలంగాణ అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం.

ఇటు మంత్రివర్గం.. అటు నామినేటెడ్ పోస్టులు :

మంత్రివర్గంలో రెండు బెర్తులే ఖాళీగా ఉన్నా పలువురు ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అందరినీ బ్యాలెన్స్ చేయడం కష్టసాధ్యం కావడంతో అవకాశం రానివారికి కీలకమైన నామినేటెడ్ పోస్టులతో సంతృప్తి పర్చాలన్నది రాష్ట్ర పార్టీ వర్గాల, ప్రభుత్వ భావన. జిల్లాల ఈక్వేషన్లు, సామాజికవర్గాలకు తగిన ప్రాతినిధ్యంతో సోషల్ జస్టిస్ ఫార్ములాను బ్యాలెన్స్ చేయాలన్నది ఇటు పీసీసీ, అటు ఏఐసీసీ ఉద్దేశం. మంత్రివర్గ కూర్పు, పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రికి (Revanth Reddy) పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా ఏఐసీసీకి క్లారిటీ ఇచ్చి కంప్లీట్ చేయాలన్నది సీఎం, పీసీసీ చీఫ్ అభిప్రాయం. ఇప్పుడున్న కొద్దిమంది మంత్రుల శాఖలు మారొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రోడ్లు భవనాలు, బీసీ సంక్షేమం, అటవీ పర్యావరణం, పరిశ్రమలు, ఆర్థికం, విద్య.. ఇలాంటి శాఖల్లో మార్పులు ఉండొచ్చని తెలిసింది. కొత్తగా ఎవరికి ఛాన్స్ ఉంటుందనేది కూడా కీలకంగా మారింది.

Read Also:  TCS మతమార్పిడి కేసు.. ప్రధాన నిందితురాలు అరెస్టు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>