కలం, వెబ్ డెస్క్ : రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే అతని జీవితం భద్రంగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. ఆ హక్కును సర్వే మ్యాప్‌తో, భూధార్ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారించినపుడే రైతుకు ధైర్యం, కుటుంబానికి భరోసా, భవిష్యత్తుపై నమ్మకం కలుగుతుందని ఆయన చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ చేసి చారిత్రాత్మకమైన అడుగు వేశామన్నారు. సర్వేమ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ అయిన సందర్బంగా మంత్రి స్పందిస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా బలోపేతం చేస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను (Bhu Bharati Portal) ఈనెల 2వ తేదీ నుంచి నారాయణపేట జిల్లా కొస్గి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని పొంగులేటి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి అనే నిబంధనను భూభారతి చట్టంలో పొందుపరిచామని అదే విధంగా ఎవరైనా స్వచ్ఛందంగా వారి ఆస్తులకు సంబంధించిన సర్వే సర్టిఫికేట్ కు కూడా దరఖాస్తు చేసుకొని ధృవీకరించుకోవచ్చన్నారు.
భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ ఉండాలన్న నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని.. ఇదే విధానాన్ని దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభించేవిధంగా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం భూ వ్యవహారాల్లో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకొచ్చిందని చెప్పారు. ప్రతి భూమికి ఖచ్చితమైన సర్వే మ్యాప్, ప్రత్యేక భూధార్ నెంబర్ కేటాయించడం ద్వారా యాజమాన్యంపై ఎలాంటి సందేహాలకు తావు లేకుండా చేస్తోందన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా ఈ సేవలను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. సర్వే విషయంలో పాత విధానాలకు స్వస్తి చెప్పి అధునాతన రోవర్లను వినియోగిస్తూ కచ్చితత్వంతో సర్వే పూర్తిచేయిస్తున్నామని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) వెల్లడించారు.
Read Also: కేరళ ఘటన.. ప్రధాని మోదీ దిగ్భాంతి
Follow Us On: X(Twitter)

