కలం, వెబ్ డెస్క్ : క్యూర్ పరిధిలో నిర్మించే ఇండ్ల డిజైన్లు పేదలు సంతృప్తి చెందేలా నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలివిడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఇందుకు అనుగుణంగా అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. 50 ఏళ్ల అవసరాలను దృష్టిల ఉంచుకుని ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని పొంగులేటి (Minister Ponguleti) అధికారులు ఆదేశించారు. కేవలం ఇళ్లు కట్టడం మాత్రమే కాదు… భవిష్యత్ తరాలకు అనుకూలంగా డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్, వాణిజ్య అవసరాలు, ప్రజల జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైతే 10 అంతస్తుల వరకు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హాల్, బెడ్‌రూమ్, కిచెన్, బాత్‌రూమ్ వంటి విభాగాల పరిమాణాల రూపకల్పనలో వాస్తు అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచనలు చేశారు.
ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అదే ప్రాంతంలో ఇండ్లు నిర్మించేలా అధికారులకు పొంగులేటి సూచించారు. ప్రజలు ఉపాధి, జీవన విధానాలకు దూరం కాకుండా నివాసాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం తుది డిజైన్లను ఖరారు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేలా రోజువారీ కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌పై కన్నేసిన అనాహత్ సింగ్!
Follow Us On : WhatsApp

