కలం, స్పోర్ట్స్ : భారత యువ స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ (Anahat Singh) సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్నారు. ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల అనాహత్, పీఎస్ఏ మహిళల ర్యాంకింగ్స్‌లో ప్రపంచ 20వ ర్యాంకుకు చేరుకున్నారు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో స్క్వాష్ ఆటను మొదటిసారి చేర్చడంతో, అక్కడ దేశం తరఫున మెడల్ గెలవడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. ఒలింపిక్స్‌లో ఆడటం ప్రతి అథ్లెట్ కల అని, ఆ సమయానికి తాను మరింత అత్యుత్తమ ఫామ్‌లోకి వచ్చి దేశానికి పతకం తెస్తానని ధీమా వ్యక్తం చేశారు. 15 ఏళ్ల వయసు నుంచే సీనియర్ ఆటగాళ్లతో ఆడుతున్నా తనకు ఎప్పుడూ భయం వేయలేదని, ప్రతి మ్యాచ్ నుండి ఎంతో నేర్చుకుంటున్నానని చెప్పారు.
అనాహత్ కెరీర్ చిన్న వయసు నుంచే విజయాలతో మొదలైంది. ఆమె 2019లో బ్రిటిష్ ఓపెన్ అండర్-11 టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2021లో యూఎస్ ఓపెన్ జూనియర్ టైటిల్ సాధించారు. ఇక 2023 ఆసియా గేమ్స్‌లో మహిళల టీమ్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు గెలిచారు. అలాగే కేవలం 15 ఏళ్లకే దేశీయ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ఆమె బ్రిటిష్ జూనియర్ ఓపెన్ అండర్-17 టైటిల్‌తో పాటు పలు పీఎస్ఏ ఛాలెంజర్ కప్పులను కూడా ముద్దాడారు.
తన క్రీడా ప్రస్థానానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎంతో స్ఫూర్తి అని అనాహత్ చెప్పారు. మొదట్లో తాను బ్యాడ్మింటన్ ఆడటం వల్లే స్క్వాష్‌లో చేతులు, కళ్ల సమన్వయం కుదిరిందని వివరించారు. సింధుకు తాను పెద్ద అభిమానిని కావడంతో, గతంలో తన తల్లిదండ్రులు ఒక వీడియో కాల్ ద్వారా సింధుతో మాట్లాడించారని గుర్తు చేసుకున్నారు. భారత్‌లో స్క్వాష్ క్రీడ ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా అనాహత్ మాట్లాడారు.
మన దేశంలో సరైన స్క్వాష్ కోర్టులు, కోచ్‌ల కొరత ఉందని చెప్పారు. తన కోచ్ ముంబైలో ఉంటే, తాను కోల్‌కతా, చెన్నై ఆటగాళ్లతో కలిసి కష్టపడి శిక్షణ పొందుతున్నానని తెలిపారు. అయినప్పటికీ ఆసియా గేమ్స్, పీఎస్ఏ టూర్లలో మన దేశ ఆటగాళ్లు రాణిస్తున్నారని, మీడియా సపోర్ట్ ఉంటే భారత్ స్క్వాష్‌లో టాప్ దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్క్వాష్ కాకుండా తనకు పెయింటింగ్, మ్యూజిక్ అంటే ఇష్టమని, గుర్రపు స్వారీ చేయడం తన కల అని అనాహత్ ముగించారు.

