కలం, తెలంగాణ బ్యూరో : జర్నలిస్టులకు (Telangana Journalists) ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశంపై ఈ నెలాఖరుకల్లా తేల్చేసి జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటన చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. ఆ రోజు ముఖ్యమంత్రి చేసే ప్రకటన జర్నలిస్టులకు శుభవార్తగానే ఉంటుందన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల అంశంపై ఏర్పడిన నాలుగు సొసైటీల ప్రతినిధులతో సచివాలయంలో శుక్రవారం సమావేశమైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు వివరాలను వెల్లడించడంతో పాట పాత్రికేయ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. జర్నలిస్టులతో సమావేశం కావడానికి ముందే ముఖ్యమంత్రితో ఈ విషయమై మంత్రి పొంగులేటి చర్చించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి చేరుకుని నిర్వహించిన సమావేశంలో మీడియా అకాడెమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద రెడ్డి కూడా పాల్గొన్నారు.
నాలుగు సొసైటీల నుంచి వివరాల సేకరణ :
ఇండ్ల స్థలాల కోసం ఏర్పడిన నాలుగు సొసైటీల ప్రతినిధులతో మీడియా అకాడమీ చైర్మన్ పలు సందర్భాల్లో విడివిడిగా సమావేశమై ఎంతమంది పాత్రికేయులు సొసైటీలలో సభ్యులుగా ఉన్నారు.. సభ్యత్వానికి అనుసరించిన విధానమేంటి.. ఇండ్ల స్థలాల కోసం తీసుకున్న ప్రామాణికాలేంటి.. జర్నలిస్టులకు అర్హతను ఖరారు చేయడానికి రూపొందించిన నిబంధనలేంటి.. ఇలాంటి అనేక అంశాలపై చర్చించారు. ఏయే సొసైటీలో ఎంతమంది సభ్యులున్నారో తెలుసుకుని మొత్తంగా నాలుగు సొసైటీలలో అర్హత కలిగిన జర్నలిస్టుల వివరాలను సేకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో నాలుగు సొసైటీల ప్రతినిధులు సమావేశం కావడానికి ముందు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సమాచార పౌర సంబంధాల విభాగం కమిషనర్ ముకుందరెడ్డి కీలకమైన అంశాలపై లోతుగా చర్చించి వివరాలను తీసుకున్నారు.
ఫోర్త్ సిటీలో 300 చ.గ. స్థలం ఇచ్చే ప్లాన్ :
ఇండ్ల స్థలాలపై వివిధ సొసైటీల ప్రతినిధులతో మీడియా అకాడమీ చైర్మన్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. హైదరాబాద్‌కు కొంత దూరంలో ఉన్న ప్రాంతాల్లోనైతే (ఫోర్త్ సిటీ) 300 చదరపు గజాల స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ జర్నలిస్టులు నగరానికి దగ్గర ఉన్న ప్రాంతాలలో స్థలం కావాలని కోరుకున్నట్లయితే 1600 చదరపు అడుగుల ఫ్లాట్ ఇచ్చే విధంగా ఏకాభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఓకేచోట పెద్ద మొత్తంలో స్థలం అందుబాటులో లేనిపక్షంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నలువైపులా స్థలాలు ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడింది. మీటింగ్‌కు హాజరైన సొసైటీ ప్రతినిధుల మనోగతాన్ని నమోదు చేసిన సమాచార కమీషనర్ ముకుందరెడ్డి ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించారు.
నాలుగు సొసైటీలతో జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం :
జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి.. చిరకాలంగా పీటముడి పడి ఉన్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 కల్లా సమస్యను కొలిక్కి తెస్తామన్నారు. నాలుగు సొసైటీలకు చెందిన తొమ్మిది మంది సభ్యులతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇవాళ్టి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఒక విజ్ఞాపన పత్రాన్ని రూపొందించి తనకు అందించాలన్నారు. ఆ ప్రతిని తాను స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన వనరుల సమీకరణ ఉప సంఘానికి అందజేస్తానని తెలిపారు. సబ్ కమిటీ ఆమోదముద్ర వేసిన తరవాత అందరం కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరకు వెళ్దామని, స్థలాల కేటాయింపు పైల్‌పై ఆయనతో సంతకం చేయించి ప్రక్రియను ముగిద్దామని వివరించారు.
జేఎన్జే సొసైటీతో మంత్రి పొంగులేటి విడి భేటీ :
జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులతో మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, గత ప్రభుత్వం ఆ సొసైటీకి కేటాయించిన భూములు రద్దు అయిపోయినట్లేనిని తేల్చిచెప్పారు. జేఎన్జే సభ్యులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో రావాలని మంత్రి సూచించారు. నిజాంపేట్, పేట్‌బషీరాబాద్‌లలో కనీసం ఒక్క స్థలాన్ని అయినా తమకు ఇవ్వాలని జేఎన్జే ప్రతినిధులలో ఒకరు మంత్రిని కోరారు. అందుకు బదులుగా, “ఇది వ్యాపారం కాదు… బేరసారాలు కుదరవు… కోర్టు తీర్పు అమలే శిరోధార్యం..” అని మంత్రి కరాఖండిగా చెప్పారు. ఆ తరువాత సచివాలయంలోనే హుటాహుటిన సమావేశమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, జేఎన్జే సొసైటీ జనరల్ బాడీ భేటీ నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. సమావేశంలో సభ్యుల ఏకాభిప్రాయం సాధించి త్వరలోనే మంత్రికి నివేదించనున్నారు.

