కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాదాబైనామా దరఖాస్తులను రాబోయే 45 రోజుల్లో పరిష్కరించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. బుధవారం ఖమ్మం (Khammam) రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలనే లక్ష్యంతో పరిపాలన కొనసాగుతోందన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల పాటు విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, పాలేరు నియోజక వర్గ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలను క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. అదే విధంగా కొత్త ఆసరా పెన్షన్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ వంటి అంశాలను సానుకూలంగా పరిశీలించి అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలో ఇందిరమ్మ ఇండ్ల రెండవ దశను ప్రారంభించి మరింత మంది అర్హులైన పేదలకు గృహ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను గరిష్టంగా మూడు నెలలలోగా తప్పనిసరిగా పరిష్కరించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికతో పని చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. న్యాయబద్ధమైన ప్రతి దరఖాస్తును తప్పకుండా పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గతంలో పదేళ్లపాటు పాలన చేసిన వారు ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శిస్తూ, ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికీ పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన చేయలేదన్నారు. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, ఆరెంపుల గ్రామానికి 109 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. రూరల్ మండలం పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి గత రెండున్నర సంవత్సరాల్లో రూ.386 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని రైతులను భయపెట్టిన పరిస్థితులను గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు పూర్తి మద్దతుగా నిలుస్తోందన్నారు. వరి పంటకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ అందిస్తున్నా మని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి పది సంవత్సరాలు పట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే మొత్తం రూ. 20,656 కోట్లతో సుమారు 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందన్నారు. కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

