కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ మరో భారీ బహిరంగసభకు సిద్ధమవుతున్నది. జగిత్యాలలో నిర్వహించిన జీవన్ రెడ్డి చేరిక సభకు ఆశించిన స్థాయిలో మైలేజ్ రాకపోవడంతో బీఆర్ఎస్ మరో సభ నిర్వహించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసా విషయంలో రాష్ట్రంలోని అన్నదాతలు కొంతమేర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ యత్నిస్తున్నట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ పేరిట సభలు నిర్వహించి సక్సెస్ అయ్యింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ సైతం అదే వ్యూహం అవలంభించబోతున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలే టార్గెట్
మే 6న వరంగల్‌లో భారీ స్థాయిలో రైతు సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో రైతు డిక్లరేషన్ ప్రకటించిన అదే వేదికను ఎంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం మోగించేందుకు బీఆర్‌ఎస్ యోచిస్తోంది. నాలుగేళ్ల క్రితం వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు.
హామీల అమలుపై ప్రశ్నలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. రైతు సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. మే 6న జరగనున్న ఈ సభను భారీగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి సభను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సభకు కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ ఈ మధ్య జగిత్యాలలో నిర్వహించిన సభలో కనిపించారు. ఇదే ఊపుతో బీఆర్ఎస్ మరో సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

