కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి లీ సియోంగ్-హోను (Lee Seong-ho) మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత్‌లో కొరియా కంపెనీలకు పెరుగుతున్న ప్రాధాన్యం, భవిష్యత్ భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లు, మైక్రో ఎలక్ట్రానిక్స్, స్టోరేజ్, షిప్ బిల్డింగ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలలో కొరియా అగ్రగామిగా నిలుస్తోందని లోకేశ్ తెలిపారు.
ఈ రంగాలలో ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రం దీర్ఘకాలిక భాగస్వామిగా మారేందుకు ఉన్న అవకాశాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను లోకేశ్ వివరించారు. కొరియా సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ భేటీతో ఆంధ్రప్రదేశ్–కొరియా మధ్య ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

