కలం, వరంగల్ బ్యూరో : మేడారం మహా జాతరలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కనిపించకపోవడం చర్చకు దారి తీసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి ఆమె దూరంగా ఉండటం పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), మంత్రి సీతక్క (Seethakka) జాతర పనులు ప్రారంభం నుంచి పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సీతక్క జాతర ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచి మేడారంలోనే ఉంటూ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా మంత్రులు పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. కానీ జిల్లాకు చెందిన మంత్రి, అందులో దేవాదాయ శాఖను లీడ్ చేస్తున్న సురేఖ జాతరకు దూరంగా ఉండటం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
*విభేదాలే కారణమా..?
మంత్రి కొండా సురేఖకు జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటితో మొదటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయని ప్రచారంలో ఉంది. మేడారం జాతర అభివృద్ధి పనుల సందర్బంగా వీరి మధ్య అంతర్లీనంగా ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. పొంగులేటి కమీషన్ల కోసం తన అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టాడని సురేఖ ఆరోపించారు. ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ మేరకు పార్టీ పెద్దల జోక్యంతో వారి మధ్య వివాదానికి తెరపడింది. కానీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు గమనిస్తే అది తాత్కాలికమే అనే విషయం స్పష్టం అవుతుంది.
జాతర ప్రారంభానికి ముందు నుంచి కానీ, ఈ రెండు రోజుల నుంచి కానీ మంత్రి సురేఖ మేడారంలో కనిపించకపోవడం కొత్త చర్చకు దారి తీసింది. ప్రముఖులు జాతరకు వచ్చి ఆ తల్లులను దర్శించుకునే నిమిత్తం జారీ చేసే వీవీఐపీ, వీఐపీ పాస్‌ల విషయంలో సైతం ఆమెను నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు, కార్యకర్తలకు అసహనానికి గురైనట్లు సమాచారం. ఈ మేరకు మంత్రి సురేఖతో పాటు వర్గీయలు మేడారం జాతరకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.


