కలం, నల్లగొండ బ్యూరో: మైనార్టీలకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) తెలిపారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని సోమవారం నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న మదీనా మసీదులో మైనార్టీలకు ఇఫ్తార్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి గతం నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో పేద మైనార్టీ మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వడమే కాకుండా 150 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
రాబోయే మూడు సంవత్సరాల్లో నిరుపేద ముస్లింలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏ అవసరం వచ్చినా మైనారిటీలు మేయర్ లేదా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, మౌలానా హఫేజ్ నిజాముద్దీన్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

