Mobile Popup Ad
Mobile Popup Ad

గోదావ‌రి కాలుష్యంపై నిరంత‌రం పొల్యూష‌న్ ఆడిట్: మంత్రి కందుల దుర్గేశ్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రాజ‌మండ్రి పర్యటనలో భాగంగా గోదావరి నది కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్య‌క్తం చేశార‌ని మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) అన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. డిప్యూటీ రెండు రోజుల రాజ‌మండ్రి ప‌ర్య‌ట‌న‌పై మంత్రి దుర్గేశ్ బుధ‌వారం నిర్వ‌హించిన‌ మీడియా స‌మావేశంలో కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. నదిలోకి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు, మురుగునీటిని స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆయన తెలిపారు. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో కూడిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 24 గంటల్లోనే జీవో విడుదల చేసిందని గుర్తు చేశారు. నదులను కలుషితం చేసే కారకాలను గుర్తించేందుకు నిరంతర ప్రాతిపదికన ‘పొల్యూషన్ ఆడిట్’ నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ముఖ్యంగా ఆంధ్రా పేపర్ మిల్లు వ్యర్థాల విడుదలపై మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా స్పందించారు. ఆ యాజమాన్యం మున్సిపాలిటీకి చెల్లించాల్సిన రూ.13 కోట్ల బకాయిలను వెంటనే కట్టాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక 2027లో జరగనున్న గోదావరి మహా పుష్కరాలను రూ.8,500 కోట్లతో అత్యంత వైభవంగా, ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, హేవలాక్ బ్రిడ్జి సుందరీకరణ, టెంట్ సిటీల ఏర్పాటుతో ఈ ప్రాంతాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రజల ఆరోగ్యం, గోదావరి పవిత్రత విషయంలో తమ ప్రభుత్వం రాజీపడదని మంత్రి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>