కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) భరోసా ఇచ్చారు. వర్షాల వల్ల ధాన్యం తడిసిందని రైతులు అదైర్యపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి తరలిస్తామన్నారు. శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి వీపనగండ్ల మండల కేంద్రం, కేతేపల్లి శివారులో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పెద్ద మొత్తంలో వరి ధాన్యం బస్తాలు తడిసిన నేపథ్యంలో వాటిని నిశితంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి దృష్టికి సమస్యలు
రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. లారీల కొరత సమస్యను ప్రస్తావించారు. ఈ క్రమంలో మంత్రి (Jupally Krishna Rao) మాట్లాడుతూ.. జిల్లాలోని ఇసుక, ఫ్యాక్టరీల కోసం వినియోగించే లారీలన్నింటిని పట్టుకొని ధాన్యం తరలించడానికే తీసుకురావాలని ఆదేశించారు. ముందుగా వీపనగండ్ల, పానగల్ పరిధిలోని కొనుగోలు కేంద్రాలకు లారీలను అత్యవసరంగా తరలించాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
రైతులను మోసం చేస్తే ఊరుకోం
రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేతేపల్లి శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేయడంపై నిర్వాహకులపై మండిపడ్డారు. కొనుగోళ్లను వేగంగా చేపట్టి వెనువెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో మిల్లర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మెహ్రూన్ ఇండస్ట్రీస్‌ను సందర్శించిన మంత్రి ధాన్యం అన్‌లోడింగ్‌పై పలు సూచనలు చేశారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. వీపనగండ్లలో ధాన్యం దించుకోవడానికి అనుకూలంగా ఉన్న గోదామును మరమ్మతుల కోసం మంత్రి ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
Read Also: జడ్చర్లలో ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

