Mobile Popup Ad
Mobile Popup Ad

జడ్చర్లలో ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: జడ్చర్ల మండల పరిధిలోని బాదేపల్లి పాతబజార్ హరిజనవాడలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) భవనానికి జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta), జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) శుక్రవారం భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. పాఠశాల భవన సమస్యను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అనంతరం అరబిందో ఫార్మా యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరిపి, వారి సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద నూతన పాఠశాల భవన నిర్మాణానికి ముందుకు తీసుకువచ్చినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి కార్పొరేట్ సంస్థ తమ లాభాల్లో రెండు శాతం నిధులను సామాజిక బాధ్యత కింద సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ గుర్తు చేశారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తే సమాజానికి మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న అరబిందో ఫార్మా సంస్థ యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి పునర్నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అరబిందో ఫార్మా సంస్థ రూ.4 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇందులో భాగంగానే బాదేపల్లిలో రూ.80 లక్షల వ్యయంతో నూతన పాఠశాల భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆమోదంతో పాత భవనాన్ని తొలగించి కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఉరుకొండ మండలం గుడిగానిపల్లిలో రూ.1.20 కోట్ల వ్యయంతో మరో నూతన పాఠశాల భవన నిర్మాణానికి కూడా అరబిందో ఫార్మా సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో అమ్నియల్, హెటరో ఫార్మా సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే భవిష్యత్తులో వారు కూడా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలు సాధించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, మండల విద్యాధికారి మంజులాదేవి, అరబిందో ఫార్మా కంపెనీ డి.జి .ఎం జనార్ధన్ రెడ్డి,అరబిందో ఫార్మా ఏ.జి.యం.(సి.ఎస్.ఆర్) ఆరుట్ల నరసింహ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: పేదలను సంతృప్తి పరిచేలా ఇండ్ల నిర్మాణాలు : మంత్రి పొంగులేటి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>