కలం, ఖమ్మం బ్యూరో : అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య (Kancharla Jalamaiah) డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం (Kothagudem) పట్టణంలోని ఆటో కార్మికులు శుక్రవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పోస్టాఫీసు సెంటర్ నుంచి బస్టాండు సెంటర్ వరకు అర్ధ నగ్నంగా ఆటోలకు తాడుకట్టి లాగుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ. స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికులపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోయలేని భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ పేదలను నట్టేట ముంచుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేవలం 11 రోజుల్లోనే ఐదు సార్లు డీజిల్ ధర పెంచి ఆటో కార్మికుల నడ్డివిరిచారని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటో కార్మికులను ఈ ధరల పెరుగుదల మరింత కుంగదీస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాలను తగ్గించి, కార్మికులను ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఆటో డ్రైవర్ లు పాల్గొన్నారు.
Read Also: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
Follow Us On : WhatsApp

