కలం, కరీంనగర్: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ మ్యాపింగ్ ప్రక్రియను గురువారం కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ (Praful Desai) క్షేత్రస్థాయిలో సందర్శించి తనిఖీ చేశారు. నగరంలోని జ్యోతినగర్, మంకమ్మ తోట, రేకుర్తి తదితర డివిజన్ల పరిధిలోని ప్రాంతాలలో పర్యటించి బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు, మార్పుల ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ఎస్ఐఆర్ వేగవంతం, ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, వివరాల నమోదు తదితర విషయాల పై బిఎల్ఓ లకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ పరిదిలో ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. నిర్థేశిత గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి బిఎల్ఓ వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలని, నగరంలో ఎక్కడా ఎవరూ విస్మరణకు గురికాకుండా ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా సర్వే చేయాలన్నారు.
సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డేటాను ఎలాంటి తప్పులు, సాంకేతిక లోపాలు లేకుండా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా వంద శాతం పారదర్శకంగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో, బూత్ లెవల్ అధికారులు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

