కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా గడుపుతున్న రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) పూరీలు వేయాలని మనవడు ఆదేశించాడు. ఇంకేముంది.. పిడికెడు పిండి అందుకుని.. చకచకా పూరీలు చేసి నూనెలో వేయించేశారు. రేవంత్ పూరీలు చేస్తుంటే.. గుండ్రంగా రావడం లేదంటూ మనవడు ముద్దుముద్దుగా చెబుతున్న వీడియోను రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది.
‘పూరీలు సరిపోతాయా..’ అని మనవడిని రేవంత్ రెడ్డి అడుగుతుంటే.. ‘ఇంకా వేయు, అమ్మమ్మకు, నాన్నకు కావాలి’ అంటుండటం చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు.
కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
ఒకటిన్నర నిమిషాల వీడియో పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడిగితే తప్పుతుందా?. పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు.. బిజీబిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..” అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఎప్పుడూ అధికారిక కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే ముఖ్యమంత్రి.. తొలిసారి ఇలాంటి వీడియో పోస్ట్ చేయడంపై నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

