కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రజల అర్జీలపై నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్యా నాయక్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి (Minister Jupally Krishna Rao) మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు అదనంగా మరిన్ని పథకాలను ప్రజలకు అందిస్తుందని తెలిపారు. విద్యా వైద్యంపై దృష్టి సారించి, వీటికి ప్రధానంగా నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రజల అర్జీలను, దరఖాస్తులను వేగంగా పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. దళారీ వ్యవస్థ అనేది సమూలంగా లేకుండా చేయాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎలాంటి సమస్య లేకుండా భూభారతికి సంబంధించి రైతుల నుంచి వచ్చే అర్జీలను శరవేగంగా పరిష్కరించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రతి వ్యక్తికి సరైన సమాచారం అందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. యువత పక్కదారి పట్టకుండా, డ్రగ్స్ వైపు మల్లకుండా క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం, ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు.
అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపట్టిందని, రైతు భరోసా, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా బాల భరోసా కార్యక్రమం కింద జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ల సంయుక్త ఆధ్వర్యంలో 16 మంది చిన్నారులకు వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం వనపర్తి, చిన్నంబావి మండలాలకు చెందిన మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తి కింద బస్సులను అందజేశారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు పచ్చిరొట్ట, జీలుగా విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్, ఫోటో ప్రదర్శనల్ని ముఖ్య అతిథులు సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం ఛైర్మెన్ గోవర్ధన్ సాగర్, వనపర్తి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మునిసిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కొత్తకోట మునిసిపల్ ఛైర్ పర్సన్ అరుణ, ఆత్మకూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ నాగమణి, అమరచింత మునిసిపల్ ఛైర్ పర్సన్ సువర్ణ, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

