కలం, జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గబ్బెట (Gabbeta) గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని కాటమయ్య గుడి వద్ద ప్రారంభమైన మంటలు గఫార్ పొలం, కోతి సోమయ్య, రంగు నరసయ్య పొలాల వరకు వేగంగా వ్యాపించాయి. అదే సమయంలో బచ్చన్నపేట మండలంలోని కట్కూర్, విఎస్ఆర్ నగర్ గ్రామ శివారుల్లో కూడా వరి కొయ్యలకు మంటలు అంటుకుని రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనల్లో పొలాల్లో నిల్వ ఉంచిన గడ్డి కట్టలు, వరి కొయ్యలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారీ సంఖ్యలో పశుగ్రాసం, వ్యవసాయానికి ఉపయోగించే మోటార్ వైర్లు, ప్లాస్టిక్ పైపు లైన్లు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి గాలి వేగంగా వ్యాపించడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు మరింత విస్తరించే అవకాశం ఉండటంతో రైతులు తమ పంటలు, గడ్డి నిల్వలను రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.
ఈ ఘటనల్లో పలువురు రైతులకు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. వేసవి కాలంలో పశువులకు అవసరమైన పశుగ్రాసం పూర్తిగా కాలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీటి కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు, పైప్‌లైన్లు కూడా దెబ్బతినడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు. మంటలు ప్రమాదవశాత్తు చెలరేగాయా? లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్తులు మాత్రం కొందరి నిర్లక్ష్యం లేదా కావాలనే చేసిన చర్య వల్లే ఈ ప్రమాదాలు జరిగి ఉండవచ్చని ఆరోపిస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

