ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా కుప్పకూలిన టమాటా ధరలు రైతులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ధరలు ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, టమాటా రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) భరోసా ఇచ్చారు. ఒక్క టమాటా రైతుకు కూడా నష్టం జరగకుండా చూసుకుంటామన్నారు. రాప్తాడు మార్కెట్‌లో టమాటా ధరలు ఆదివారం రోజున గరిష్ఠం రూ.18కాగా కనిష్ఠం రూ.9గా ఉందని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ(Pattikonda) మార్కెట్‌కు 30-40 మెట్రిక్ టన్నులకు మించి సరుకు రాదని చెప్పారు. దసరా సెలవుల దృష్ట్యా మరో 10 టన్నుల టమాటా అదనంగా చేరిందని వివరించారు. రోడ్లపై రెండో గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించారని, వర్షాల వల్ల తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు ఎగుమతి తగ్గిందని చెప్పారు. ఎడతెరిపిలేని వర్షాల వల్లే టమాటా అమ్మకాలు మందగించాయని, రైతులకు న్యాయం జరిగేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
గిట్టుబాటు ధర కల్పించండి: రైతుల
టమాటాలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై టమాటాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కోరారు. 10 కిలోల టమాటా గంపలు రెండిటికి కలిపి రూ.80 నుంచి రూ.100 పలికిందని, మార్కెట్లో వ్యాపారులు 25 కిలోల గంపలను రూ.180 కనిష్ఠ ధరకు కొన్నారని వాపోయారు. లాభం సంగతి పక్కనబెడితే పెట్టిన పెట్టుబడి కూడా తమకు తిరిగి రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే టమాటా రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) ధైర్యం చెప్పారు.

