కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) లోని పీఎంజే జ్యువెలరీలో జరిగిన దొంగల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సిబ్బందిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోపిడీకి పాల్పడిన నిందితులను ప్రభుత్వం త్వరలోనే పట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బాధిత సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దొంగలను పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని పది ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి, ఇతర రాష్ట్రాలకు పంపినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అలాగే, ఈ సందర్భంగా మంత్రి (Minister Adluri Laxman) రాజకీయ అంశాలపై కూడా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ముఖ్యమంత్రిని దొంగలతో పోల్చడం తగదని అన్నారు. రేవంత్ రెడ్డి గతంలో ఏ కేసులో జైలుకు వెళ్లారన్న విషయంపై అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
అదేవిధంగా, టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వామనరావు దంపతుల హత్య కేసు, అక్రమ ఇసుక రవాణా అంశాలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరగా, కేటీఆర్ తన మాటలను అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మరోసారి అనుచితంగా మాట్లాడితే సహించబోమని స్పష్టం చేశారు.
Read Also: మోదీ సభను డైవర్ట్ చేసేందుకే సీబీఐ డ్రామాలు.. బండి సంజయ్
Follow Us On : WhatsApp

