కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar) ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ప్రైవేటు స్కూల్స్‌కు ధీటుగా అద్భుతమైన ఫలితాలు సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. పరిస్థితులను అధిగమించి తమ ప్రతిభతో, పట్టుదలతో చదివితే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రుజువు చేశారని తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా రాణించి సమగ్ర అభివృద్ధి సాధించాలని సూచించారు. పరీక్షలలో ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని ఆయన ప్రోత్సహించారు. జీవితం ఒక్క పరీక్షతో ముగిసేది కాదని, మరిన్ని అవకాశాలు ముందున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ విజయాలకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కీలక పాత్ర పోషించిందని ఎమ్మెల్యే ప్రశంసించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

