కలం, కరీంనగర్ బ్యూరో : గురుకుల పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకం రోజురోజుకీ పెరుగుతోందని, ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) అన్నారు. మంగళవారం పెద్దపల్లి (Peddapalli) జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ (Mallapur) గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న అల్పాహారం, భోజన మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్‌లను కూడా పరిశీలించారు.
మల్లాపూర్ గురుకుల పాఠశాలకు సరఫరా చేసిన సన్న బియ్యాన్ని పరిశీలించిన మంత్రి (Minister Adluri), అందులో నూకల శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకుని, సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని సరఫరా చేయాలని పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల అధికారికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలలో సుమారు 27 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. విద్యార్థులకు యూనిఫార్మ్‌లతో పాటు అవసరమైన అన్ని వస్తువులు అందించేందుకు ప్రత్యేకంగా కృషి జరుగుతోందని వివరించారు.
గురుకుల పాఠశాలల మైనర్ రిపేర్ల కోసం రూ. 69 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. తల్లిదండ్రుల నమ్మకం పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గురుకులాలలోని విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గురుకుల పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంక చిన్నారి.. వీడియో వైరల్
Follow Us On: Instagram

