కలం, కరీంనగర్: పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు, నిబద్ధత, సమర్థవంతమైన విధి నిర్వహణకు గుర్తింపుగా కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ వెంకట రమణ (Additional DCP Venkata Ramana)కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ మెడల్ పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్‌లో భాగంగా ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.
1991లో సబ్ఇన్స్పెక్టర్గా పోలీస్ శాఖలో తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించిన వెంకట రమణ హైదరాబాద్ ట్విన్ సిటీస్‌లోని పలు కీలక, మతపరంగా సున్నితమైన ప్రాంతాలతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.
2017లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన హైదరాబాద్ ట్రాఫిక్ బ్రాంచ్, గోపాలాపురం, నార్త్ జోన్, టీఎస్ విజిలెన్స్, ఎస్ఆర్ నగర్ వెస్ట్ జోన్ తదితర ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2005లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ చత్రినాక, ముషీరాబాద్, అంబర్పేట్, జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓగా బాధ్యతలు నిర్వహించారు.
కీలక కేసుల ఛేదనలో కీలక పాత్ర:
సబ్ఇన్స్పెక్టర్గా పనిచేసిన సమయంలో మాండ్రక్స్ (NDPS) కేసు, అక్రమ ఆయుధాల స్వాధీనం, నార్త్ ఇండియన్ గ్యాంగ్స్, నకిలీ స్టాంపుల కేసులు, నకిలీ ఇందిరా వికాస్ పత్రాలు, గంజాయి/నకిలీ సర్టిఫికెట్ల కేసులు తదితర కీలక కేసుల ఛేదనలో ఆయన కీలక పాత్ర పోషించారు. జడ్చర్ల ఎస్హెచ్ఓగా పని చేసిన సమయంలో హత్యలు, హైవే దోపిడీలు, గ్యాంగ్‌రేప్ కేసులను ఛేదించి నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేపట్టారు.
సేవలకు గుర్తింపు:
వెంకట రమణ తన సేవలకు ఇప్పటికే తెలంగాణ పోలీస్ సేవా పతకం (2010), తెలంగాణ పోలీస్ ఉత్తమ సేవా పతకం (2018), యూనియన్ హోం మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్–2022 వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. వీటితో పాటు 107 క్యాష్ రివార్డులు, ఒక అడ్వాన్స్ ఇన్క్రిమెంట్, 7 ప్రశంసా పత్రాలు, 4 అభినందనలు, 15 MSEలు, 162 GSEలు ఆయన సేవా రికార్డులో ఉన్నాయి.
2025 మే 22న అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన, 2025 జూన్ 2 నుంచి కరీంనగర్ కమిషనరేట్‌లో అదనపు డీసీపీ (అడ్మిన్)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణ, అంకితభావం, సమర్థవంతమైన దర్యాప్తు, ప్రజా భద్రత పట్ల నిబద్ధతతో విశిష్ట సేవలు అందించినందుకు వెంకట రమణకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ లభించడం పట్ల కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

