Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి: ఎస్ఎఫ్ఐ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జాతీయ పరీక్షల సంస్థ (NTA) వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తక్షణమే రాజీనామా చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కార్యదర్శి భరత్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్టీయే వైఫల్యాలను నిరసిస్తూ మంగళవారం నిర్వహించిన “చలో లోక్ భవన్” కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకులను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్, భరత్ మాట్లాడుతూ.. NTA నిర్లక్ష్యం, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న లోపాలు, అవకతవకలు దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన, అభద్రతను సృష్టిస్తున్నాయని అన్నారు. పరీక్షల వ్యవస్థపై నమ్మకం దెబ్బతినడంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత బాధాకరమని విమర్శించారు.

విద్యార్థులకు పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షల నిర్వహణను నిర్ధారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు ఆరోపించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు NTA పనితీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అందువల్ల NTA వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

NTAలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని, విద్యార్థుల భవిష్యత్తును రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలను విస్మరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, మణికంఠ బాలకృష్ణ, నందకిషోర్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>