ఆసుప‌త్రి సిబ్బందిపై చేయి చేసుకున్న మంత్రి.. వీడియో వైరల్!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో జ‌రిగిన లిఫ్ట్ ప్ర‌మాదంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) తీవ్ర‌ ఆగ్ర‌హానికి గుర‌య్యారు. స‌హ‌నం కోల్పోయిన మంత్రి ఆస్ప‌త్రి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. క‌రీంన‌గ‌ర్‌లో గురువారం చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే… ఇటీవ‌ల‌ గొల్ల‌ప‌ల్లి మార్కెట్ యార్డులో జ‌రిగిన లారీ ప్ర‌మాదంలో రాజ‌య్య అనే రైతు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నాడు. మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ గురువారం రైతును ప‌రామ‌ర్శించేందుకు ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో పై అంత‌స్తుకు వెళ్లేందుకు ఆస్ప‌త్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ ఎక్కారు. సాంకేతిక లోపంతో లిఫ్ట్ కేబుల్‌వైర్ తెగిపోయి ఒక‌టో అంత‌స్తు నుంచి ఒక్క‌సారిగా కుప్ప కూలింది. ఈ ప్ర‌మాదంలో మంత్రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. దీంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే లిఫ్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మంత్రి తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. లిఫ్ట్ బ‌య‌ట ఉన్న ఆస్ప‌త్రి సిబ్బంది పై చేయి చేసుకున్నారు. లిఫ్ట్ నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం వ‌హించార‌న్న కోపంతో ఆయ‌న సిబ్బందిపై చేయి చేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. లిఫ్ట్ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మే కానీ, మంత్రి ప‌ద‌వి ఉన్న అడ్లూరి ఆస్ప‌త్రి సిబ్బందిపై చేయి చేసుకోవ‌డం స‌రికాద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>