తెలంగాణను అగ్రగామిగా నిలపడమే లక్ష్యం: మంత్రి అజారుద్దీన్

కలం, కరీంనగర్ బ్యూరో: స్వాతంత్య్ర‌ సమరయోధుల త్యాగాల స్ఫూర్తి, సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలో, ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) అన్నారు. స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జగిత్యాల (Jagtial) పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా

జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 3,53,166 నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతోందని మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలో 48,868 నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి 87,837 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేశామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు తదితర 11 కేటగిరీలకు చెందిన 2,18,002 మంది లబ్ధిదారులకు ప్రతి నెల సుమారు రూ.47 కోట్ల పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఆగస్టు 15 నుంచి కొత్త చేయూత పింఛన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు.మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు సొంతింటి కల సాకారం చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలో మైనార్టీ మహిళలకు 598 కుట్టుమిషన్లు, 150 మంది యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందించామని మంత్రి తెలిపారు. రేవంత్ అన్న సహారా కింద 15 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షలు, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన ద్వారా 76 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షలు మంజూరు చేశామని చెప్పారు.

వైద్య రంగంలో మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. రహదారులు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో రూ.1,084.83 కోట్లతో 292 పనులు మంజూరు కాగా, అందులో 224 పనులు పూర్తయ్యాయి, 69 పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలిపారు. స్వాతంత్య్ర‌ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన నిర్వహించాయి.విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీస్ డాగ్ స్క్వాడ్ బృందం, అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ విధుల్లో భాగంగా నిర్వహించే వివిధ కార్యకలాపాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే రక్షణ చర్యలను ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకున్నారు.

వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు. మహిళా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. 675 స్వయం సహాయక సంఘాలకు రూ.75 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు,1,053 స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి ద్వారా రూ.18.20 కోట్లు, మెప్మా 32 సంఘాల్లో 186 మంది లబ్ధిదారులకు 13.93 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను మంత్రి అందజేశారు.

అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన వివిధ శాఖల స్టాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు జగిత్యాల జిల్లాలోని 20 మండలాలలో ఒక మండలానికి 5 స్మార్ట్ రేషన్ కార్డులు చొప్పున మొత్తం 100 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ , ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ , మున్సిపల్ ఛైర్పర్సన్ ఎస్.వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు ప్రజాప్రతినిధులు, అదనపు కలెక్టర్లు బి.రాజ గౌడ్‌, బి.ఎస్. లత,డి.ఆర్.ఓ. ప్రసాద్, ఆర్ డి ఓ లు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>