కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెంచి సామాన్య ప్రజలకు షాక్ ఇచ్చిందని సీపీఎం కరీంనగర్ (Karimnagar ) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి (Milukuri Vasudeva Reddy) విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం దేశ ప్రజలపై పెను భారం మోపారని, పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని గీతా భవన్ చౌరస్తాలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆటోను లాగుతూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే దేశ ప్రజలపై పెను భారం మోపే విధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెంచిందన్నారు. ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రులు, దేశంలో ధరలు పెంచబోమని ప్రగల్బాలు పలికారని, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అని నిలదీశారు. ఓట్లు వేయించుకొని ప్రజల జేబులకు బీజేపీ ప్రభుత్వం చిల్లులు పెడుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఎప్పుడూ కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించలేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే దేశ ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రమే అదనపు భారాన్ని భరించాల్సి ఉందన్నారు. పెట్రోల్ లీటర్‌కు రూ.3.50 పైసలు, డీజిల్ లీటర్‌కు రూ.5, సీఎన్జీ కిలో రూ.2, గ్యాస్ బండ కమర్షియల్ రూ.1000 పెంచారని, ధరల పెంపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మండిపడ్డారు.
ఈ పెంపు వల్ల ఆటోలు,టాక్సీలు, లారీలు, బస్సు చార్జీలు పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం తీరుతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ తలకిందులు అవుతుందన్నారు. కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఖర్చులు పెరుగుతాయన్నారు. ప్రతి ఏటా సంపన్నులకు రాయితీలు ఇస్తూ, ప్రజలపై పెను భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారని, సామాన్యుడి పై పెట్రో బాంబు పేల్చడం తగదన్నారు. కేంద్రంలో 12 సంవత్సరాల బీజేపీ పాలనలో సామాన్యులకు ఉపయోగపడే చట్టాలు, పథకాలు ఏ ఒక్కటి తీసుకురాలేదని విమర్శించారు. దేశంలో గంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుందన్నారు.
ఇలాగే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారని ఎద్దేవా చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు వెంటనే తగ్గించాలని లేదంటే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, జి.రాజేశం, జిల్లా నాయకులు తిప్పారపు సురేష్, రాయికంటి శ్రీనివాస్, గజ్జల శ్రీకాంత్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, కాంపెల్లి అరవింద్, బోడ మోహన్, ఆవుల రాజయ్య, రాకేష్, సందేశ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

