బాక్సింగ్ వరల్డ్ కప్‌లో క్వార్టర్స్‌కు మీనాక్షి

కలం, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న బాక్సింగ్ వరల్డ్ కప్ (స్టేజ్-2) (World Boxing Cup) లో భారత స్టార్ బాక్సర్ మీనాక్షి మరో అడుగు ముందుకేసింది. మహిళల 51 కేజీల విభాగంలో పోలాండ్‌కు చెందిన నటాలియా కుజెవ్‌స్కాపై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో టోర్నీలో భారత ఆశలు మరింత బలపడ్డాయి. ప్రస్తుత 48 కేజీల ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్-1గా ఉన్న మీనాక్షి ఈసారి 51 కేజీల విభాగంలో పోటీపడుతోంది. నాలుగో రోజు జరిగిన బౌట్‌లో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచి 5-0 తేడాతో ఏకగ్రీవ నిర్ణయంతో విజయం సాధించింది.

అయితే పురుషుల 65 కేజీల విభాగంలో అభినాష్ జమ్వాల్‌కు నిరాశ ఎదురైంది. కిర్గిజ్‌స్తాన్‌కు చెందిన మీర్జోఖిద్ ఇమామ్‌నజరోవ్ చేతిలో 0-5 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇప్పటివరకు భారత జట్టు నుంచి నిఖిల్ (55 కేజీలు), దీపక్ (70 కేజీలు), మీనాక్షి (51 కేజీలు), ప్రాచి (57 కేజీలు), సనేహ్ (65 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మరోవైపు జ్యోతి (48 కేజీలు), జుగ్నూ (85 కేజీలు) సెమీఫైనల్స్‌కు చేరడంతో భారత్‌కు ఇప్పటికే రెండు పతకాలు ఖాయమయ్యాయి.

ఐదో రోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో మీనాక్షి కజకిస్థాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాతో తలపడనుంది. సనేహ్ పోలాండ్‌కు చెందిన కింగా క్రోవ్కాను, ప్రాచి చైనీస్ తైపీకి చెందిన చెంగ్యూ యాంగ్‌ను ఎదుర్కోనుంది. పురుషుల విభాగంలో నిఖిల్ అజర్‌బైజాన్‌కు చెందిన అమిన్ మమ్మద్‌జాదాతో, దీపక్ పూనియా నబీ ఇస్గందరోవ్‌తో పోటీ పడనున్నాడు. టోర్నీలో భారత బాక్సర్లు వరుసగా ముందుకు సాగుతుండగా, రానున్న క్వార్టర్ ఫైనల్ పోరాటాలు మరింత కీలకంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>