కలం, వెబ్ డెస్క్ : భారత హాకీ (Indian Hockey) చరిత్రలో అరుదైన రికార్డు సాధించిన ఆటగాడిగా మన్‌ప్రీత్ సింగ్ (Manpreet Singh) నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో 413 మ్యాచ్‌లు ఆడి అత్యధిక క్యాప్స్ సాధించిన భారత హాకీ ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించాడు. ఈ విజయంపై స్పందించిన మన్‌ప్రీత్, తన సుదీర్ఘ కెరీర్‌కు ఫిట్‌నెస్ ప్రధాన కారణమని వెల్లడించాడు. ఆధునిక హాకీలో పోటీ తీవ్రత మరింత పెరిగిందని, ఫిట్‌గా లేకపోతే ప్రపంచ స్థాయిలో కొనసాగడం చాలా కష్టమని స్పష్టం చేశాడు. 33 ఏళ్ల ఈ అనుభవజ్ఞుడు మాట్లాడుతూ, జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే వయస్సుతో సంబంధం లేకుండా నిరంతరం మెరుగుపడాల్సిందేనని తెలిపాడు. మ్యాచ్‌లు పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందని, కోచ్‌లు ఎప్పుడూ ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంటారని అన్నాడు.
తన ఫిట్‌నెస్ కోసం క్యాంప్‌లో ఉన్నా, విరామ సమయంలో ఉన్నా సాధనను ఎప్పుడూ ఆపలేదని మన్‌ప్రీత్ చెప్పాడు. ఆహార నియమాలు పాటించడం నుంచి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వరకు ఎన్నో త్యాగాలు చేశానని వెల్లడించాడు. 2011లో కేవలం 19 ఏళ్ల వయసులో సీనియర్ జట్టులో అడుగుపెట్టిన మన్‌ప్రీత్, గత 15 ఏళ్లుగా భారత హాకీకి కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ హాకీలో 400కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రియాశీల ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు.

